Ap Handloom Clusters: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లు..! 1 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో రెండు చేనేత క్లస్టర్లు చొప్పున మొత్తం 10 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు తొలి విడతగా రూ.5 కోట్లు విడుదల చేయగా, మిగతావాటికి రూ. 2 కోట్లు మంజూరుకు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో 2వేలమంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం చేనేత, అనుబంధ రంగాలకు చెందిన 3.50 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 క్లస్టర్లు ఉంటే..చేనేత కార్మికుల్ని 100 నుంచి 500 మంది ప్రాతిపదికగా ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్లో చేనేత కార్మికుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి రూ.2 కోట్లు మంజూరు అవుతాయి.
కేంద్రం విడుదల చేసే ఈ నిధులతో క్లస్టర్ పరిధిలోని కార్మికులకు 90% రాయితీతో చేనేత కార్మికులకు అవసరమైన ఆధునిక యంత్రాలు(రూ.15-70 వేల విలువైనవి) అందజేస్తారు. అయితే లబ్ధిదారులు 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. 100% రాయితీతో వ్యక్తిగత వర్క్షెడ్డును కూడా నిర్మిస్తారు. చేనేత కార్మికులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు డిజైనర్ కూడా క్లస్టర్ లో అందుబాటులో ఉంటారు.
అలాగే కేంద్రప్రభుత్వం చేనేతలకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ను కూడా నియమిస్తుంది.
కాంప్రహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల డెవలప్మెంట్ స్కీమ్:
చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ... కొత్త డిజైన్ల ద్వారా చేనేతకార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు 2008-09లో కేంద్రప్రభుత్వం కాంప్రహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల డెవలప్మెంట్ స్కీమ్ ను తీసుకొచ్చింది.